• Login / Register
  • BC Caste Census | కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి

    BC Caste Census | కలెక్టర్లు ఎనుమరెటర్ లతో విస్తృతంగా మాట్లాడాలి 
    మంత్రులు, ఎమ్మెల్యేల కు సమాచారం ఇవ్వండి
    దేశం మొత్తం తెలంగాణను గమనిస్తుంది
    బీసీ కుల‌గ‌ణ‌న‌ సర్వే ప్రారంభం నేప‌థ్యంలో ఉన్న‌తాధికారుల‌కు ఆదేశాలు 
    వీడియో కాన్ఫరెన్స్‌ద్వారా  డిప్యూటీ సీఎం భట్టి వెల్ల‌డి 


    Hyderabad : బీసీ కుల‌గ‌ణ‌న‌లో భాగంగా ఇంటికి స్టిక్క‌రింగ్ ప్ర‌క్రియ‌ పూర్తిచేసుకుని శ‌నివారం నుంచి ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో కలెక్టర్లు ఏనుమరెటర్లతో విస్తృతంగా మాట్లాడాలని డిప్యూటీ సీఎం  మ‌ల్లు భట్టి విక్రమార్క అన్నారు. శనివారం సమగ్ర కుటుంబ సర్వే అంశంపై ఉన్నతాధికారులతో  వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.  ఈ సంద‌ర్భంగా ఆయన మాట్లాడారు. ఇంటింటి సర్వే ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రజల నుంచి అనేక సందేహాలు వ్యక్తమవుతుంటాయ‌ని, కలెక్టర్లు ఎనుమరెటర్  లతో ఎప్పటికప్పుడు మాట్లాడితే ప్రజల సందేహాలు గురించి ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకునే అవకాశం ఉంటుంద‌ని తెలిపారు. ప్రజల సందేహాలను కలెక్టర్లు ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి ప్రజల అనుమానాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేయాలని ఆదేశించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కువ సార్లు సర్వేలో భాగస్వాములు అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. సమగ్ర కుటుంబ సర్వే చాలా పెద్ద కార్యక్రమం అని, ఇలాంటి కార్యక్రమాన్ని ఇప్పటివరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ముందుకు తీసుకెళుతున్న అధికారులను కూడా డిప్యూటీ సీఎం అభినందించారు.  ఈ మేర‌కు ప్ర‌శ్నావ‌ళి పకడ్బందీగా రూపొందించారని, ఎనుమరేటర్లకు బాగా శిక్షణ ఇచ్చార‌ని, హౌస్ లిస్ట్ కూడా విజయవంతంగా పూర్తి చేశార‌ని తెలిపారు ఇదే  విధంగా కుటుంబ సర్వేను విజయవంతంగా నిర్వహించాలని కోరారు. 
                  ఈ దేశంలో జరిగే అతిపెద్ద కార్యక్రమం కుల‌గ‌ణ‌న అని తెలిపారు. మనం చూపే నిబద్ధతపైనే ఈ సర్వే విజయవంతం కావ‌డం అనేది ఆధారపడి ఉంటుంద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు. యావత్ దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం చేపడుతున్న కుటుంబ సర్వేను గమనిస్తుందని వివరించారు. ఈ దేశంలో ప్రగతిశీల భావాలను, కార్యక్రమాలను వ్యాప్తి చేయడానికి ఈ సర్వే గొప్పగా ఉపయోగపడుతుందని తెలిపారు.  జిల్లా కలెక్టర్లు ప్రతి చిన్న విషయం కూడా నిర్లక్ష్యం చేయకుండా ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఇతర  ఉన్న‌తాధికారుల  దృష్టికి తీసుకువెళ్లాలని ఎప్పటికప్పుడు సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపారు. సర్వేపై కలెక్టర్లతో పాటు అన్ని స్థాయిలోని అధికారులు విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. ప్రధానంగా పట్టణాలపై దృష్టి పెట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి, ప్రణాళిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
    *  *  *

    Leave A Comment